బిడ్డ ప్రాణాలు తీసిన పోలీస్ చలానాలు.. జనగామలో.. - MicTv.in - Telugu News
mictv telugu

బిడ్డ ప్రాణాలు తీసిన పోలీస్ చలానాలు.. జనగామలో..

June 1, 2022

 

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో మంగళవారం ఓ శిశువు ప్రాణాలను రూ.1,100 చలానాలు బలిగొన్న సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ మండలం మరిపగి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశ, సరస్వతి దంపతులకు మూడు నెలల కిందట కుమారుడు (రేవంత్‌) జన్మించాడు. కొన్ని రోజులుగా శిశువు పాలు తాగడం లేదు. జనగామలో ఉన్న శ్రీసుధా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మంగళవారం అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, రేవంత్‌ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అందుబాటులో ఉన్న కారును అద్దెకు మాట్లాడుకుని హైదరాబాద్‌ బయలుదేరారు.

ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామ సమీపంలోకి రాగానే స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు కారును ఆపారు. రూ.1,100 మేర చలానాలు ఉన్నాయని, వాటిని చెల్లిస్తేనే విడిచిపెడతామని పోలీసులు చెప్పారు. దాంతో తమ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని మల్లేశ, సరస్వతి తెలిపారు. చేసేది ఏమీ లేక కారు డ్రైవర్‌ సాయి వంగపల్లి సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్లి చలానా కట్టి, బాబును హైదరాబాద్‌ వెళ్లేసరికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులు తమ మాట వినివుంటే ఈరోజు తమ కొడుకు బతికే ఉండేవాడని కన్నీరు మున్నీరు అయ్యారు.

ఈ ఘటనపై యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ సీఐ సైదులు మాట్లాడుతూ..” ఆ కారును మా పోలీసులు ఆపలేదు. మంగళవారం ఉదయం మా సిబ్బంది జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించిన మాట వాస్తవమే. కానీ, ఆస్పత్రికి వెళ్తున్నామని ఎవరూ మా దృష్టికి తేలేదు. శిశువును ఎవరు ఏ కారులో తెచ్చారో, ఎవరికీ తెలియదు. ఆపద ఉందంటే మేమే వేరే కారులో పంపించి ఉండేవాళ్లం. మా సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదు” అని ఆయన అన్నారు.