బయట కరోనా ఉంది, వెళ్లకు డాడీ..  వైరల్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

బయట కరోనా ఉంది, వెళ్లకు డాడీ..  వైరల్ వీడియో

March 26, 2020

Police Officer baby crying video viral.. she say not going outside

కరోనా వైరస్ వంకతో ఎంతోమందికి మంచికో, చెడుకో తమతమ కుటుంబాలతో గడిపే అవకాశం లభించింది. కానీ, వారందరినీ 24 గంటలు కంటిమీద కునుకు లేకుండా కాపుగాస్తున్న పోలీసులకు ఆ అవకాశం లేకుండా పోయింది. వైద్యులు, పారిశుద్య కార్మికులతో సహా పోలీసులు తమ ఇళ్లను మరిచి విశ్రాంతిలేకుండా పనిచేస్తున్నారు. వారికీ కుటుంబాలు ఉంటాయి.. వారికీ పిల్లలు, సెంటిమెంట్లు, వ్యక్తిగత జీవితాలు, ఆనందాలు ఉంటాయి. అవన్నీ మరిచి కేవలం సామాజ హితమే తమ కర్తవ్యంగా వారు పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబాయిలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ విధులకు హాజరయ్యేందుకు రెడీ అవుతుండగా, అతడి కొడుకు తన తండ్రి ఇంట్లోనే తనతోపాటే ఉండాలని కోరుకుంటూ ఏడ్చాడు. ‘నాన్నా ఇంట్లోనే ఉండు.. బయట కరోనా ఉంది. వెళ్లకు నాన్నా’ అంటూ ఏడుస్తున్న తన కొడుకుని ఆ పోలీస్ ఎత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నా ఊరుకోవడం లేదు. ఈ వీడియో ఎందరినో కదిలిస్తోంది. 

 

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒకరికొకరు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. లేకుంటే.. భారత దేశం కూడా ఇబ్బందులు ఎదుర్కోడం తప్పదని ఆరోగ్య సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కొందరు పట్టింపులేని వాళ్లతో పాపం పోలీసులకు పని పెరిగింది. దీంతో వారికి కొంత సమయం అయినా తమ భార్యా బిడ్డలతో గడపే అవకాశం దొరకడం లేదని నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.