ఇసుక మాఫియా ఘోరాల గురించి మనకు చాలా తెలుసు. రాజకీయ నాయకుల అండదండలు, కొన్నిచోట్ల పోలీసుల సాయంతో నిరాటంకంగా సాగుతున్న ఈ దోపిడీ పరిణామాలు దారుణం. అడ్డుకోబోయిన అధికారులను కూడా తొక్కి చంపుతుంటుంది మాఫియా. చివరికి నికార్సయిన పోలీసులను కూడా వదలిపెట్టదు. హరియాణాలో మైనింగ్ మాఫియా ఆగడాలను అడ్డుకోబోయిన ఓ డీఎస్పీ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయనను రాళ్ల లోడున్న లారీతో తొక్కి చంపేశారు.
నువాలో మంగళవారం ఈ ఘోరం జరిగింది. రాళ్ల అక్రమ మైనింగ్ జరుగుతోందని సమాచారం రావడంతో డీఎస్పీ ర్యాంకు అధికారి అయిన సురేంద్ర సింగ్ బిష్ణోయ్ తన సిబ్బందితో కలసి వెళ్లాడు. లారీని వేగం తగ్గించమని సిగ్నల్ ఇచ్చాడు. అయితే డ్రైవర్ ఆపకుండా వేగంగా లారీని పోనిచ్చాడు. దీంతో సురేంద్ర అక్కడిక్కడే చనిపోయాడు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని, దుండగు కోసం గాలిస్తున్నారు.