పవర్ ఫుల్ ఆఫీసర్స్ కే ఎందుకిలా..?
దేశంలో పవర్ ఫుల్ ఆఫీసర్స్ ను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.అదీ పోలీస్ శాఖలో ఐతే మెరికలే. ఎక్కడో ఒకచోట కానీ కనిపించరు.అలాంటోళ్లు అదరక, బెదరక డ్యూటీ ఈజ్ డ్యూటీ అని చేస్తుంటే…బదిలీలే బహుమానంగా ఇస్తున్నారు. ఇవాళ కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప..మొన్న యూపీ పోలీస్ ఆఫీసర్ శ్రేష్టా ఠాకూర్. ఇలా ట్రాన్స్ ఫర్ రివార్డులు పొందినోళ్లే. పవర్ ఫుల్ ఆఫీసర్లకే ఎందుకిలా జరుగుతోంది..?మంచి పనులు చేస్తే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?దేశమంతా వీళ్ల తప్పేం లేదంటోన్నా పాలకులకు ఎందుకు కనిపించడం లేదు..?
బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నాడీఎంకే పార్టీ చిన్నమ్మ శశికళకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అక్రమ వ్యవహారాలను వెలుగులోకి తీసుకు వచ్చినందుకే ఐపీఎస్ అధికారి రూపను బదిలి చేశారని జనం విరుచుకుపడుతున్నారు. కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ మీద సంచలన ఆరోపణలు చేసిన రూపను ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ విభాగం డీఐజీగా బదిలీ చేశారు. కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారయణ రావును బదిలీ చేశారు. సత్యనారాణరావుకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆయన సెలవు మీద వెళ్లిపోయారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను టార్గెట్ చేయడం సరికాదని జైళ్ల డీఐజీ రూప మౌద్గిల్ అన్నారు. ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ అందరికీ వర్తించాలని, తన ఒక్కదానికే కాదని అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే అందరిపై చర్యలు తీసుకోవాలని రూప వ్యాఖ్యానించారు.
నిజమే రూప అన్నదాంట్లో తప్పు లేదు. జనానికి కూడా ఈమె చేసినట్లో తప్పు కనిపించలేదు. సీఎం సిద్ధరామయ్య సార్ కు మాత్రమే ఆగుపించింది.
ఆయన స్పందిస్తూ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ, స్టాంపుల కేసు దోషి తెల్గీ నుంచి జైళ్ల శాఖ ఐజీపీ సత్యనారాయణరావు ముడుపులు తీసుకుని రాచమర్యాదలు చేస్తున్నారని ఆ శాఖ డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు డీఐజీ రూప సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా డీజీపీ సత్యనారాయణ జైళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని పలుమార్లు మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం తగదని అన్నారు.
ఇంతకీ ఎవరీ రూప
రూప స్వసస్థలం దావణగెరె. పనిచేసిన ప్రతిచోటా సంచలనాలకు కేరాఫ్. 2000లో సివిల్స్‌లో 43వ ర్యాంక్ కొట్టి ఐపీఎస్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందారు. షార్ప్ షూటర్‌గా పేరుంది. ఆ బ్యాచ్‌లో ఓవరాల్‌గా 5వ స్థానంలో నిలిచారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను 2016 జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగా పతకాన్ని అందుకున్నారు. ఓ కేసులో కోర్టు తీర్పు ప్రకారం అప్పటి మధ్యప్రదేశ్ సీఎం ఉమాభారతీని ఎస్పీ హోదాలో అరెస్టు చేశారు.
ఆమె బెంగళూరు డీసీపీగా ఉండగా వీవీఐపీల భద్రతా సిబ్బందిని తొలగించి లా అండ్ ఆర్డర్ విభాగానికి మార్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. డీసీపీ (సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్) గా విధులు నిర్వర్తించే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా యడ్యూరప్ప ఓ ఊరేగింపులో ఎక్కువ వాహనాలను వినియోగించడాన్ని గుర్తించిన రూప వెంటనే వాటిని తొలగించారు. ఇలా డైనమిక్ ఆఫీసర్ గా ఆమెకు మంచి పేరుంది.
మొన్న యూపీలో లక్నో పోలీస్ అధికారి శ్రేష్టా ఠాకూర్ ను కూడా ఇలాగే బదిలీ చేశారు. అధికారిక బీజేపీ లీడర్ ని లైసెన్స్ అడినందుకు ఆమెపై వేటేశారు. అసలు దేశంలో మంచి పనిచేస్తే బదిలీయే బహుమతియా..?ఇది అది అని కాదు..ఏ సర్కార్ యైనా ఇలాగే ఉంది.
నీతులు వల్లించే నేతలు…న్యాయంగా పనిచేస్తున్న అధికారుల్ని ఎందుకిలా చేస్తున్నారు.ఇదేం మంచి పద్దతి కాదు. మెరికల్లాంటి అధికారుల్ని అణగదొక్కితే…ధైర్యంగా పనిచేసే ఆఫీసర్ల మనో స్థయిర్యాన్ని దెబ్బతీసినట్టే…పాలకురాల్లారా..స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించండి..అని జనం కోరుతున్నారు.