పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ.! - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ.!

January 21, 2020

ujyhg

విశాఖపట్టణం జిల్లా నక్కపల్లిలో ఓ వ్యక్తి పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకెళ్లి పోలీసులను కంగారు పెట్టించాడు. అమరావతికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లోని పెట్రోలింగ్ వాహనాలతో నక్కపల్లి ఎస్సై ఆదివారం అర్దరాత్రి కాగిత టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. తమ పెట్రోలింగ్ వాహనాలను పక్కనబెట్టి వీరంతా వాహన తనిఖీలో మునిగిపోయారు.

అదే సమయంలో పాయకరావుపేటకు చెందిన ఓ వ్యక్తి పెట్రోలింగ్ వాహనాన్ని స్టార్ట్ చేసి తునివైపు బయలుదేరాడు. ఈ క్రమంలో వాహనం ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ బైక్‌ను ఢీకొట్టాడు. అయినప్పటికీ ఎవరూ గుర్తించలేకపోయారు. వాహన తనిఖీలు అయిపోయిన తర్వాత వచ్చి చూసిన పోలీసులు పెట్రోలింగ్ వాహనం లేకపోవడంతో షాకయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని వెతుక్కుంటూ తునివైపు బయలుదేరారు. ఈ క్రమంలో గొడిచెర్ల చౌరస్తాలోని జాతీయ రహదారి పక్కన పెట్రోలింగ్ వాహనం బోల్తాపడి ఉండడాన్ని గుర్తించారు. అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడికి మతిస్థిమితం లేదని తేలింది. ఉన్నతాధికారుల సూచనతో అతడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు.