Police reconstructed the scene in the case of CI Nageswara Rao
mictv telugu

తుపాకీ గురిపెట్టి వివాహితపై రేప్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు

July 22, 2022

హైదరాబాదులో సంచలనం రేపిన సీఐ నాగేశ్వరరావు కేసులో ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. హయత్ నగర్ కోర్టు ఆదేశాలతో సీఐని చర్లపల్లి జైలుకు రిమాండుకు తరలించారు. అంతకు ముందు దర్యాప్తులో భాగంగా వివాహిత కణతపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం చేసిన దగ్గర నుంచి కారులో ఇబ్రహీంపట్నం కారు ప్రమాదం వరకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. సీఐపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు నాగేశ్వరరావును ప్రశ్నించారు.

ఇప్పటికే భర్త, వివాహిత, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు వాటికి సంబంధించి పలు ప్రశ్నలను అడిగారు. అందులో కొన్నింటికి సమాధానాలు చెప్పి మరికొన్నింటికి మౌనంగా ఉండిపోయారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కస్టడీ కన్ఫెషన్ రిపోర్టు కీలకం కానుందని వెల్లడించారు. కాగా, ఈ నెల 7న తనపై అత్యాచారం చేశాడంటూ ఓ వివాహిత సీఐపై ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని 10వ తేదీన పట్టుకొని 11న చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలో తీసుకున్నారు.