తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్ధులకు ఫిజికల్ ఈవెంట్లు మళ్లీ నిర్వహించనున్నారు. ఒక్క సెంటీమీటర్ తేడాతో అనర్హులైన అభ్యర్ధులకు మాత్రమే ఈవెంట్లు నిర్వహిస్తామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అర్హత కలిగిన వారికి హైదరాబాదులో పరీక్షలు ఉంటాయని వెల్లడించింది.
అంతకుముందు డిస్ క్వాలిఫై అయిన అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. దీంతో ఆయా అభ్యర్ధులకు ఊరట కలిగినట్టయింది. కాగా, ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం బోర్డు ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 16 వేల 969 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఒక లక్షా 75 వేల 657 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒక పోస్టుకు 11 మంది పోటీ పడుతున్నారు. అటు 587 ఎస్ఐ పోస్టులకు 59 వేల 574 మంది పోటీ పడుతుండగా, ఒక్కో పోస్టుకు 101 మంది ఉన్నారు.