సూపర్ పోలీస్.. పరిగెత్తిమరీ ప్రాణాలు కాపాడాడు
రైలు ప్రయాణంలో చాలా మంది అజాగ్రత్త వల్లనో.. లేక ఊహించని పరిణామంతో కిందపడి మరణించిన సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. కానీ అక్కడ కిందపడబోయిన వ్యక్తి అదృష్టమో ఏమో కానీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనంతటికీ కారణం అక్కడ ఉన్న పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండి సాయం చేయడమే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తి దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పిన అతడు రైలుకు, ఫ్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వికుల్‌కుమార్ రైలుకింద పడిపోకుండా పట్టుకున్నాడు. రైలు వెంట పరిగెత్తి మరీ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడాడు. ఇది చూసినవారంతా అతని సమయస్పూర్తికి మెచ్చుకోవడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికుల్‌కుమార్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.