జనావాసాలకు వచ్చిన ఓ అనుకోని అతిథిని చూసి షాక్ అయ్యారు అక్కడి స్థానికులు. దాన్ని పట్టుకొని, సురక్షిత ప్రాంతానికి తరలించే సరికి అధికారులకు చుక్కలు కనిపించాయి. అమెరికాలోని దక్షిణ కరొలినాలో జరిగిందీ సంఘటన. ఆ ప్రాంతంలోని డానియల్ ఐస్లాండ్ స్కూల్ బయట ఓ మొసలి పాకుతూ కనిపించింది. వెంటనే గమనించిన స్థానికులు.. పోలీసులకు కాల్ చేయడంతో డిపార్ట్మెంట్లో భాగమైన యానిమల్ కంట్రోల్ యూనిట్ అధికారులు ఆ మొసలిని పట్టుకుందామని అక్కడికి వెళ్లారు. వాళ్లను చూడగానే.. ఆ మొసలి ఎట్టి పరిస్థితుల్లో వీళ్లకు దొరకకూడదు అనుకుంటూ అటూ ఇటూ వెళ్లసాగింది. అధికారులు కూడా దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని.. అతి కష్టం మీద ఇద్దరు మహిళా పోలీసులు.. మొసలి మూతికి తాడును బిగించగలిగారు. ఆ సమయంలో మొసలిపై పడి.. బలంగా దాన్ని పట్టుకుంటే కానీ దాన్ని బంధించడం సాధ్యం కాలేదు. ఈ అరెస్టుకి సంబంధించిన వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. “మా టీమ్ చక్కటి ధైర్యసాహసాలు ప్రదర్శించింది” అని మెచ్చుకున్నారు.