వాహ్.. పోలీస్ దిమాక్ సూపర్..ఆ కేసుల్లో వాస్తు దోషి..! - MicTv.in - Telugu News
mictv telugu

వాహ్.. పోలీస్ దిమాక్ సూపర్..ఆ కేసుల్లో వాస్తు దోషి..!

June 30, 2017

ఎంతైనా పోలీసోళ్ల తెలివి పోలీసోళ్ల తెలివే. వాసన చూసి పసిగట్టేస్తారు. కలుగులో దాక్కున్నా నేరం చేసినోడ్ని ఇట్టే బయటకు లాగుతారు. నాలుగో సింహం స్కెచ్ వేసిందంటే నీచ్ కమీన్ లు తోకముడవాల్సిందే.అంతకు మించి ఖాకీల దిమాకే దిక్సూచి. బ్యూటీషియన్ శిరీష, కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిల ఆత్మహత్యల్లో తప్పు ఎవరిదో పోలీసులు తేల్చారు. ఎ 1 శ్రవణ్ , ఎ2 రాజీవ్ వల్లభనేనికి ఈ కేసుకు అసలు సంబంధం లేదంట. తప్పంతా కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ వాస్తు దోషానిదట. వావ్ పోలీస్ దిమాక్ సూపర్. స్పీడ్ యుగంలో రాకెట్ లా మెరుపులాంటి సొల్యూషన్. వీళ్లు ఏ కాలపు పోలీసులు..?వాస్తుకు కేసులు ఏమైనా సంబంధం ఉందా..?ఇద్దరు ఎస్ ఐ లు చనిపోవడానికి కారణం అదేనా..?

తెలంగాణ వచ్చాక అన్ని పోలీస్ స్టేషన్ల రూపు రేఖలు మారిపోయాయి. అందమైన బిల్డింగ్..విశాలమైన మైదానం..పచ్చని చెట్లతో కొన్నింటిని మోడల్ స్టేషన్లలా మార్చేశారు..మరికొన్నింటినీ మార్చబోతున్నారు. సీఎం కేసీఆర్ సూచనల ప్రకారమే కొత్త పీఎస్ ల్ని వాస్తు ప్రకారం నిర్మించారని అంటారు. వాస్తు అంటే బాగా నమ్మే కేసీఆర్ …వాస్తులేని ఆఫీసులకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లారని చెబుతూ ఉంటారు.మొన్నటికి మొన్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న టైమ్ లో రామ్ నాథ్ కోవింద్ కు వాస్తు సలహా ఇచ్చారు. వాస్తును తెగ నమ్మే సీఎం కేసీఆర్ ఇలాకాలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు దోషం ఉందట. వెంటనే వాస్తు దోషాలను సరిచేసే పనిలో పోలీసులు ఉన్నారట. స్పీడ్ యుగంలో పోలీస్ స్టేషన్ కు వాస్తు గిస్తు ఏంటీ..?

కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ కొన్నాళ్లుగా వార్తల్లో ఉంది. ఇక్కడ ఇద్దరు ఎస్ ఐలు ఆత్మహత్య చేసుకోవడమే కారణం. ఆ తర్వాత ఇక్కడ పోస్టింగ్ అంటే వామ్మో అనేవాళ్లు..అక్కడకు బదిలీ అయిన పోలీస్ ఫ్యామిల్లో తెలయని భయాందోళన ఉండేది. చివరకు ఎలాగోలా కొత్తగా ఎస్ ఐ సంతోష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీరాగానే రైటర్ ఉన్న కొత్త గదికి మారారు. రైటర్ ను పాత ఎస్ ఐ ల గదికి పంపారు. ఇది వాస్తు దోషం సరిచేయటంలో భాగమట. ఉన్నతాధికారులకు ఓ మాట చెప్పి మరి మార్పులు చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఎస్సైలు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న క్వార్ట‌ర్ల‌ను కూల్చివేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఉన్న‌తాధికారులూ వోకే అన్నారట. పోలీస్‌స్టేష‌న్ పార్కింగ్ స్థ‌లంలో కొత్త గోడ‌లు క‌డుతున్నారు. వాస్తు నిపుణుల్ని రప్పించి మరి రిపేర్లు చేస్తున్నారు.

కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ ను 1996లో ప్రారంభించారు. తొలుత డాగ్ బంగ్లాలో స్టేషన్ ఉండేది. రాజీవ్ రహదారి మీద ఉండే ఈ బంగ్లా పాతది కావటంతో 1999లో కొత్త భవనాన్ని కట్టారు. అందులోకి స్టేషన్ మారిన తర్వాత కూడా డాగ్ బంగ్లా ఖాళీగానే ఉంచారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న డాగ్ బంగ్లాను కూల్చేశారు. అప్పటి నుంచే స్టేషన్ లోని ఎస్ ఐలకు కొత్త కష్టాలు వచ్చాయట. వరుస ఘటనలతో వాస్తు నిపుణులను సంప్రదించి.. స్టేషన్ ను చూపించినట్లుగా టాక్.

సరే ఎవరి నమ్మకం వారిది..పోలీసోళ్లు కూడా మనుషులే కదా. కొత్తగా ఎదైనా కట్టుకోండి సార్లూ…కానీ వచ్చిన ఆరోపణలు సంగతి మరిస్తే ఎలా? ఉన్నతాధికారుల వేధింపుల దోషాన్ని ఎవరు సరిచేయాలి..?కంప్లయింట్ దారులతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటున్నారో లేదో తెలుసుకునే అధికారులు…మధ్య స్థాయి అధికారుల టార్చర్ ను తెలుసుకుపోతే ఎలా..?

అయినా ఇది ఏ కాలం.ప్రపంచం ఎక్కడికి వెళ్తోంది. మన నాలుగో సింహం ఎక్కడికి పోతోంది. ఓ పనిచేయండి ఇక ముందు ఏమైనా జరిగని రానిది జరిగితే వాస్తు నిపుణులపై కేసు పెట్టేయండి..పీడ విరగడవుతుంది. పొలిటికల్ లీడర్లకంటే సెంటిమెంట్ ఉంటే ఉండొచ్చు. పోలీసోళ్లకు వాస్తు సెంటిమెంట్ ఎందో..డీజీపీ సారూ.. జర ఆలోచించండి..వాస్తు మాయలో అసలు నిజాలు పారిపోవచ్చు.జారిపోవచ్చు.తీరా అంతా అయ్యాక అయ్యోయో అనే దాని కన్నా ముందే మూడో కన్ను తెరిస్తే బెటర్.