Police survey on extramarital affairs in AP
mictv telugu

మీ ఇంట్లో వివాహేతర సంబంధాలు ఉన్నాయా? ఏపీలో పోలీసుల సర్వే

December 22, 2022

ప్రభుత్వాలు సాధారణంగా సర్వేలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల వివరాలు, అందుతున్న సంక్షేమ పథకాలు వంటివి తీసుకోవడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఏపీలో పోలీస్ శాఖ ఓ అడుగు ముందుకేసింది. మీ ఇంట్లో వివాహేతర సంబంధాలు ఉన్నాయా? మల్టీపుల్ లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారా? ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారా? వీటికి సంబంధించి పాత కేసులు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలను అడుగుతున్నారు. ‘నేరాలు జరిగే అవకాశం ఉన్న పాత గొడవల వివరాల సేకరణ’ పేరిట పోలీస్ శాఖ ఇంటింటికీ వెళ్లి ఇలాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతోంది.

ఇందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను వినియోగించుకుంటోంది. ముఖ్యంగా మహిళా పోలీస్ సిబ్బంది వాలంటీర్లతో కలిసి తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఈ విషయాలు రాబడుతున్నారు. ఇవే కాకుండా ఆస్తి, సరిహద్దు వివాదాలు, గృహ హింస కేసులు, మద్యపానం, కుల, మత, రాజకీయ విరోధాలు, ఈవ్ టీజింగ్ వంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇలా మొత్తం 12 అంశాలపై రోజూ సాయంత్రం 7 గంటలకు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ వివరాలు సేకరించే క్రమంలో కొన్ని కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని సమాచారం.