బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్ సస్పెండ్ - MicTv.in - Telugu News
mictv telugu

బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్ సస్పెండ్

February 27, 2020

Police

సంగారెడ్డి జిల్లాలోని వెలిమెల నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని తండ్రిని కాలితో తన్నిన ఘటనపై హోంశాఖ స్పందించింది. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన్ను సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు. 

విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా విద్యార్థిని కుటుంబం అడ్డు తగిలింది. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా విద్యార్థిని మృతదేహం తరలిస్తుండగా అడ్డుకున్న ఆమె తండ్రిని  కానిస్టేబుల్‌ శ్రీధర్‌ బూటు కాలితో తన్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ స్పందించి చర్యలకు ఆదేశించారు. దీంతో అతన్ని సస్పెండ్ చేసినట్టుగా డీజీపీ ప్రకటించారు. కాగా విద్యార్థిని మరణానికి కారణాలు తెలుసుకోవాలని ఆమె తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు.