మావోయిస్టును 12 కి.మీ మోసుకెళ్లిన పోలీసులు
తీవ్రంగా గాయపడిన ఓ మావోయిస్టును చికిత్స కోసం పోలీసులు 12 కి.మీ మోసుకెళ్లారు. ఈ సంఘటన ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దంతెవాడలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలోని సుక్మా జిల్లా అడవుల్లో డీఆర్‌జీ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టులు పరుగెత్తారు. ఈ క్రమంలో మడ్కం హిద్మా అనే మావోయిస్టు ఓ గుంతలో పడిపోయాడు.
కాలికి తీవ్ర గాయమైన మడ్కంను వదిలేసి మిగతా మావోయిస్టులు పారిపోయారు. మడ్కం మెల్లగా గుంతలో నుంచి బయటకు వచ్చి అదే జిల్లాలోని నాగల్‌గుండ గ్రామానికి చేరుకున్నాడు. మడ్కం నాగల్‌గుండ గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మడ్కంను పట్టుకున్నారు. అప్పటికే తీవ్ర గాయంతో బాధపడుతున్న మడ్కంను చికిత్స కోసం దంతెవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతన్ని మంచంపై కూర్చోపెట్టి వాగులు దాటుతూ 12 కి.మీ మోసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లోని మలన్‌గిర్‌లో 2008 నుంచి మడ్కం కీలకపాత్ర పోషిస్తున్నాడని, అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు, ఐఈడీ బాంబులు అమర్చడంలో అతడు దిట్ట అని పోలీసులు తెలిపారు.