కొల్లాపూర్‌లో పొలిటికల్ హీట్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కొల్లాపూర్‌లో పొలిటికల్ హీట్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్

June 26, 2022

ఉమ్మడి మహబూబ్ నగర్, ఇప్పటి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉన్న నేపథ్యంలో విభేదాలు రాగా, శనివారం ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు బహిరంగ చర్చకు రావాలిన జూపల్లి సవాల్ విసరడంతో ఎమ్మెల్యే అందుకు అంగీకరించి చర్చకు బయల్దేరారు. అప్పటికే ఆయన ఇంటికి అనుచరులు భారీగా చేరుకోగా, పరిస్థితిని గమనించిన పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకొని ఆపడానికి ప్రయత్నించారు. అయినా ఎమ్మెల్యే వినక, వెళతానని పట్టుబట్టడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వాహనంలో ఎక్కించారు. అనుచరులు వాహనానికి అడ్డుపడ్డా, వారిని దాటి పోలీసులు ఎమ్మెల్యేను పెద్దకొత్తపల్లికి తీసుకెళ్లారు. కాగా, 2014లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి, తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో సుమారు 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది.