బాలికలపై, మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడేవాడేవారిలో చాలామంది కుటుంబ సభ్యులు, సమీప బంధువులేనని నేరాల రికార్డులు ఘోషిస్తున్నాయి. ఇళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగే ఈ దురాగతాలపై చాలామంది మహిళలు ఇప్పుడు బహిరంగంగా నోరు విప్పుతున్నారు. ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ కూడా తను ఎదుర్కొన్న అఘాయిత్యాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్యంలో తన కన్నతండ్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె వెల్లడించారు. తనకు ఎనిమిదేళ్లున్నప్పుడు ఈ హింస జరిగిందని చెప్పారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల్యంలో తన తండ్రి కారణంగా తమ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొందని చెప్పారు.
‘‘మా అమ్మ మా నాన్న వల్ల చాలా ఇబ్బందులు పడింది. నాకు ఎనిమిదేళ్లున్నప్పుడు మా నాన్న లైంగికంగా వేధించాడు. మా అమ్మకు చెబితే నమ్మదేమో అనుకున్నాను. భర్త తప్పుడు చేయడని, ఆయన దేవుడని ఆమె నమ్మకం. నాన్న వేధింపులు భరించలేకపోయాను. పదిహనేళ్ల వయసులో ఎదురు తిరిగాను. నాకు పదహారేళ్లున్నప్పుడు ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మళ్లీ రాలేదు. మేం చాలా కష్టాలు పడ్డాం. బాలబాలికలు ఇలాంటి దారుణాలకు గురైతే ఆ ప్రభావం వారి జీవితాంతం ఉంటుంది. ఏదేమైనా మనం ధైర్యంగా నిలబడాలి’’ అని ఖుష్బూ చెప్పారు.