మన దేశంలో వివిధ రకాల కాలుష్యాల కారణంగా ఒక్క (2019) ఏడాదిలోనే 23లక్షల అకాల మరణాలు సంభవించినట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ నిర్వహించిన తాజా నివేదికలో వెల్లడైంది. వీటిలో 16లక్షల మంది కేవలం వాయు కాలుష్యం వల్లే మరణించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఆ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది కాలుష్యం బారిన పడి మరణించారని వివరించింది. కలుషితమైన గాలి, విషపూరిత రసాయనాల కారణంగా ప్రాణ నష్టంతో పాటు ఆ ఏడాదిలో ప్రపంచానికి 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ కాలుష్యంతో అకాల మృత్యువు బారిన పడుతున్నారని ఆ నివేదిక తెలిపింది. పలు రకాలైన కాలుష్యాలలో.. ఆ ఒక్క ఏడాదే ప్రపంచవ్యాప్తంగా 66లక్షల మంది , నీటి కాలుష్యంతో 13లక్షల మంది, సీసం కారణంగా 9 లక్షలతోపాటు మరో 8.7లక్షల మంది ఇతర విషపూరిత వాయువుల కారణంగా చనిపోయారు. ఇక భారత్లో వాయుకాలుష్యం కారణంగా మరణించిన వారిలో అత్యధికంగా 9.8లక్షల మంది అకాల మరణం చెందారు.
కాలుష్యం కారణంగా ముఖ్యంగా భారత్, చైనా దేశాలు పెను ముప్పును ఎదుర్కొంటున్నాయని నివేదిక నొక్కి చెప్పింది. కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం బారత్ పరికరాలు, నియంత్రణ వ్యవస్థలను రూపొందించింది, కానీ కాలుష్య నియంత్రణ చర్యలను మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లడం కోసం అక్కడ కేంద్రీకృత వ్యవస్థ లేదని రిపోర్ట్ వెల్లడించింది. భారత్లోని 93 శాతం ప్రాంతంలో డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాల కంటే ఎక్కువగా కాలుష్య సమస్య ఉందని నివేదిక తెలిపింది.