ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ వేడుక బుధవారం ఖమ్మంలో నిర్వహించనున్నారు. రూ. 250 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్న ఈ వేడుక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైందిగా పేరుగాంచింది. ఎస్ఆర్ గార్డెన్స్‌లో జరుగనున్న ఈ వేడుక కోసం 25 ఎకరాల్లో రిసెప్షన్ వేదిక, 25 ఎకరాల్లో భోజన ఏర్పాట్లు, 100 ఎకరాల్లో సుమారు 60 వేల కార్లకు పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంతేకాక, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాగర్ కాలువపై ఏకంగా కోటి రూపాయలతో వంతెనను కూడా నిర్మించారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో 10 లక్షల మందికి ఆహ్వానం పంపగా, సుమారు 3 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్‌తో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు. అటు అతిథులకు ఆహ్వాన పత్రికలతో పాటు ఓ గోడ గడియారాన్ని బహుమతిగా పంపినట్టు సమాచారం. కాగా, ఈ నెల 12 వ తేదీన శ్రీనివాస్ రెడ్డి ఏకైక కూతురు స్వప్ని రెడ్డి వివాహం ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఇందుకు ఇక్కడ నుంచి దాదాపు 500 మంది బంధువులు, ఆత్మీయులను ప్రత్యేక విమానంలో తరలించడం గమనార్హం.