Ponnian selvan maniratnam movie review
mictv telugu

పొన్నియిన్ సెల్వన్… మూవీ రివ్యూ

September 30, 2022

మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్ మణిరత్నం తాజా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ వన్ భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్‌కి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మణిరత్నం మార్క్‌ చూయించిందా? ప్రేక్షకులు అంతలా కథకి, పాత్రలకి కనెక్టయ్యారా? వెండితెరపై వెయ్యేళ్ల తమిళ చోళ రాజుల కథ వారిని మెప్పించిదా?

కథ సింపుల్‌గా ఇదీ అని చెప్పడానికి చాలా కష్టం. కల్కి క్రిష్ణమూర్తి రాసిన ఐదుభాగాల నవలనే రెండు భాగాలుగా, అందులోనే ఓ పార్ట్‌లో రెండున్నర గంటల్లో తెరపై చూపాలంటే ఇంకా కష్టం. కానీ స్టోరీ టెల్లింగ్ మాస్టరయిన మణిరత్నం ఆ ప్రక్రియలో చాలా వరకు సక్సెసయ్యాడు. సినిమా ప్రారంభంలోనే చిరు వాయిస్ ఓవర్‌తో అసలు కథని, ముఖ్య పాత్రల్ని పరిచయం చేసి ఎవరు ఏంటి? వాళ్ల లక్ష్యాలేంటి అనేది పరిచయం చేశారు. దాంతో చోళ ప్రపంచంలోకి మెల్లిగా అడుగుపెడతారు ప్రేక్షకులు.
కానీ ఒక పాత్ర వెనక ఇంకో పాత్ర, ఒకరి కథయిపోగానే ఇంకో కథ ఇలా వస్తూనే ఉండడంతో ఫస్టాఫ్ సా..గుతూ వచ్చినా సెకండాఫ్‌కి అసలు కథలోకి వెళ్లబోతున్నాం అని సగటు ప్రేక్షకుడికి అర్థమైపోయి ఎదురుచూస్తాడు. సెకండాఫ్‌లో అసలు డ్రామా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్‌, మరీ గ్రాండియర్ సీన్స్‌ కోసమే కాకుండా పాత్రల మధ్య సంక్లిష్టతని ప్రేక్షకుడు ఫీలవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే ప్రేక్షకులకు మూవీ అంతలా కనెక్టవ్వలేదు.

ఆ రాజులు, ముఖ్య పాత్రలు, రాజ్యాల పేర్లు, వాళ్ల యుద్ధాలు, వైరుధ్యాలు తమిళ జనాలు ఓన్ చేసుకోగలరు కానీ..మిగతా భాషల ప్రేక్షకులు అంత ఈజీగా ఎక్కించుకోలేరు. ప్రచారంలో భాగంగా ఈ సినిమా హాలీవుడ్ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉంటుందా అనడిగితే, ‘గేమ్‌ ఆఫ్ థ్రోన్సే ఇండియన్ పొన్నియిన్ సెల్వన్’ అంటూ చెప్పుకొచ్చాడు మణిరత్నం.
నిజానికి ఆ సీరిస్ అంత పెద్దగా తీయగల కథే ఇది. అన్నన్ని పాత్రలు, అన్ని ఘట్టాలున్నప్పుడు అవలీలగా గంటల్లోనే తెరపై కళ్లకు కట్టడం అంటే కష్టమే కాదు అసాధ్యం కూడా. ఆ రకంగా మణిరత్నం కొంచెం ఎక్కువే సక్సెసయ్యాడు. అసలు తెలుగువారికి ఏ మాత్రం పరిచయం లేని కథ, క్యారెక్టర్లతో ఆడియెన్స్‌ను కూచోబెట్టగలిగాడు. క్లైమాక్స్‌, ఆ తర్వాతొచ్చే సస్పెన్స్‌ చూశాక కథ ఎలా ముగుస్తుంది అని రెండో భాగం కూడా చూడడానికి ప్రేక్షకులు చూస్తారు. మరీ ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తారనేంత లేదు కానీ. చూస్తారు. అంతే.

ఇక కాస్ట్ అండ్ క్రూ విషయానికొస్తే ఫస్టాఫ్ అంతా కార్తీనే కనిపించి కథను నడిపించాడు. సెకండాఫ్‌ అసలు స్టోరీ అంతా జయం రవి చుట్టే తిరుగుతుంది. ఏమాటకామాటే కొన్ని సీన్స్‌లో ఐష్, త్రిష అందంగా కనబడడానికి పోటీపడ్డారేమో అనేంతలా తెరపై మెరిసిపోయారు. సినిమాలో సాంగ్స్‌ చాలా మందికి ఎక్కకపోవచ్చు. ఏ ఆర్‌ రెహమాన్ ట్యూన్ ఎలా ఉన్నా చోళ సంస్కృతిని చూయించడానికి అన్నట్టుగా కొరియోగ్రఫీ ఉండడంతో సోసో అనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్‌ పరంగా సూపరే. ముఖ్యంగా క్లైమాక్స్‌, షిప్ ఫైట్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. తోట తరణి ప్రొడక్షన్ వర్క్ అదనపు బలం సినిమాకి. మొత్తంగా మణిరత్నం మేకింగ్ కి ఓకే అనుకున్నా ‘నాట్ ఎవ్రీ వన్స్‌ కప్ ఆఫ్ సాంబార్’ అని మాత్రం అనిపిస్తుంది.

  • మురళీ సర్కార్

(ఈ సమీక్ష విమర్శకుడి దృష్టికోణానికి సంబంధించినది, ఇందులోని అభిప్రాయాలతో మైక్ టీవీకి సంబంధం లేదు)