పూనమ్ హనీమూన్‌లో రచ్చ.. భర్త అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

పూనమ్ హనీమూన్‌లో రచ్చ.. భర్త అరెస్ట్.. 

September 22, 2020

Poonam Pandey's husband Sam Bombay arrested in Goa on assault charges..

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలన తారగా మారిన బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఇంటర్నెట్ సెన్సేషన్ పూనమ్ పాండే పెళ్లి కూడా ఎట్టకేలకు వివాదాస్పదమే అయింది. పెళ్లి అయిన పది రోజులకే పూనమ్ తన భర్త మీద కేసు పెట్టింది. హనీమూన్‌కు వెళ్లిన ఆ జంట మధ్య వివాదం చెలరేగింది. దీంతో పూనమ్ తన భర్త సామ్ బోంబే మీద గోవా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మంగళవారం అతన్ని అరెస్టు చేశారు. సామ్ తనను వేధింపులకు గురిచేశాడని, తనపై దాడికి పాల్పడ్డాడని పూనమ్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సామ్‌ను అరెస్ట్ చేశారు. సామ్‌ను దక్షిణ గోవాలోని కనకోనలో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పూనమ్ పాండే అక్కడ ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. 

బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఇదిలావుండగా  పూనమ్‌తో తీసుకున్న అన్నీ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సామ్ బోంబే తొలగించాడు. దీంతో వారిద్దరి మధ్య ఏదో తేడా జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, పూనమ్ పాండే, సామ్ బోంబేల వివాహం పది రోజుల క్రితం జరిగింది. తనకు పెళ్లయిన విషయాన్ని, భర్తతో తాను తీసుకున్న ఫోటోలను పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. గోవాకు హనీమూన్ వెళ్తున్నట్టు, వెళ్లాక అక్కడి ఫోటోలను పూనమ్ అప్‌డేట్ ఇచ్చింది. గోవాలో ఓ వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు భర్తతో పాండే హనీమూన్‌ను ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో వారి మధ్య ఏం జరిగిందనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.