ఊరుకు ఊరే కూడబలుక్కుని అతనితో మాటామంతి బంద్ చేశారు. అతని కుటుంబం ఊర్లో ఉంది, వారికీ అవసరాలు ఉంటాయి అనే ధ్యాస లేకుండా అతనికి ఎలాంటి అవసరం ఉన్నా పట్టించుకునే పాపాన పోలేదు. దీంతో అతను ఊరందరి మధ్యలో ఒంటరి పక్షిలా జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఊరంతా ఇంతగా అతనిమీద కక్షగట్టారు అంటే.. కచ్చితంగా అతను కరడుగట్టిన కిరాతకుడే అయి ఉండాలి అనే అనుమానం కలగక మానదు. కానీ, అసలు నిజం తెలిస్తే మీరు అతన్నే కరెక్ట్ అంటారు.. ఊరోళ్లను మీరేం మనుషులురా నాయనా అంటారు. ఇంతకీ అతను ఊరోళ్ల దృష్టిలో ఏం తప్పు చేశాడంటే.. కేవలం ఊరోళ్లకు దావత్ ఇవ్వలేదు. అంతే వారంతా అతనిపై అలకబూనారు. అది మౌనంగా, పంతంగా, వెర్రిగా మారి మూడేళ్లను ముగించుకుంది.
అతని పేరు సంతాన్ నిర్మలాకర్. చత్తీసగఢ్ ముంగేలీ జిల్లాలోని ఘటోలీ పారా గ్రామంలో నివసిస్తుంటాడు. 2016లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతని కొడుకు చనిపోయాడు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న అతనికి కొడుకు అర్థాంతరంగా చనిపోవడంతో అతను మరింత దుఖ్ఖంలోకి వెళ్లిపోయాడు. చేతికి వచ్చిన కొడుకు పోయాడని అతను, అతని భార్య కన్నీరు మున్నీరు అవుతున్నారు. అలాంటివారిని ఓదార్చడానికి ఊరోళ్లు ఒక్కరు కూడా రాలేదు. ‘ఊరోని బాధ ఊరోనికి ఉంటే ఊసుకండ్లోని బాధ ఊసుకండ్లోనికే ఉంటది’ అన్న చందంగా మూర్ఖంగా ప్రవర్తించసాగారు ఆ ఊరోళ్లు. కుమారుడు పోయిన తరువాత అతడి జ్ఞాపకార్థం ఊరందిరినీ పిలిచి సంతాన్ భోజనం పెట్టలేదని గ్రామస్థులంతా అలిగారు.
అప్పటినుంచి సంతాన్ కుటుంబాన్ని వెలివేసిన్టటు దూరంగా పెడుతున్నారు. గత మూడేళ్లుగా అతడి కుటుంబంతో మాటాపలుకూ లేకుండా వెలివేసినట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్లింట్లో పిల్లలకు గానీ, ఎవరికి ఏమైనా, చివరికి చచ్చినా పట్టింకునే నాధుడు కరువయ్యాడు. దీంతో విసుగు చెందిన సంతాన్.. ఇటీవలె గ్రామస్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కన్న కొడుకు పోయాడన్న బాధ అతనిలో ఉంటే మీరు పంతాలకు పోయి ఇంత నిర్దాక్షిణ్నంగా ప్రవర్తిస్తారా అని పోలీసులు గ్రామస్థులకు గడ్డి పెట్టారు.