పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు సజీవం - MicTv.in - Telugu News
mictv telugu

పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

October 21, 2020

ఐపీఎల్ లీగ్ మ్యాచులు పూర్తి కావస్తున్నాయి. దీంతో అన్ని జట్లు ప్లేఆఫ్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీపై విజయం సాధించిన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో శిఖర్ ధవన్ 61 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ధవన్‌కు ఇది రెండో సెంచరీ. ధావన్ వినహా ఆటగాళ్లు ఎవరూ అంతగా రాణించలేదు.

165 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 17 పరుగులకే కెప్టెన్ కేఎల్ రాహుల్(15) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. పూరన్ 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులతో చెలరేగాడు. పూరన్ అవుటైన తరువాత మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేసి పంజాబ్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సెంచరీతో అదరగొట్టిన ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.