పోప్‌ను భయపెట్టిన బుజ్జిగాడు - MicTv.in - Telugu News
mictv telugu

పోప్‌ను భయపెట్టిన బుజ్జిగాడు

March 16, 2018

నువ్వు ప్రపంచ కేథలిక్ క్రైస్తవులకు మతగురువైతే నాకేంటి? మరొకటైతే నాకేంటి? నా నోట్లో వేలిపెడితే కొరికిపారేస్తా..! జాగ్రత్తయ్యో పెద్దాయనా… నా జోలికొస్తే ఖబడ్దార్!’.. ఏడు నెలల కార్ల్ క్లాపర్ అనే ఈ బుజ్జిగాడికి మాటలు వచ్చి ఉంటే ఇలాంటి డైలాగులే కొట్టేవాడు. కార్ల్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఎందుకంటే.. ఆ చిన్నోడు పోప్ ఫ్రాన్సిస్ వేలు కొరికి, ఆయన్ను భయపెట్టేశాడు కనుక.

కార్ల్ తల్లిదండ్రులు జాన్ హెనింగ్, క్రిస్టెన్ ఇటీవల వాటికన్ సిటీకి వచ్చారు. పోప్‌ను చూసి ఆశీర్వాదాలు పొందాలకున్నారు. సామూహిక ఆశీర్వాద కార్యక్రమంలో ఆ అవకాశం వచ్చింది. పోప్ అందరినీ పలకరిస్తూ వస్తూ.. ముద్దొస్తున్న కార్ల్ బుగ్గలను పట్టుకున్నాడు. ఏదైనాసరే నోట్లోకి అందుకుని నాకేసి, చీకేసే అందరు పిల్లల్లాగే కార్ల్ కూడా పోప్ వేలిని గబుక్కున నోట్లోకి దోపుకుని వచ్చీరాని పాలపళ్లతో కొరికేశారు. దీంతో పోప్ చటుక్కున వేలిని వెనక్కి తీసుకుని ‘అబ్బో నొప్పి..’ అని భయపడినట్లు పోజు పెట్టారు. ఈ దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది.