క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ హెమోసెక్సువాలిటీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. దీన్ని నేరంగా పరిగణిస్తున్న చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చికి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని స్వాగతం పలకాలని కేథలిక్ బిషప్లకు సూచించారు. ఈ కమ్యూనిటీ పట్ల కొన్ని వివక్షాపూరిత చట్టాలు ఉన్నాయని, వాటిని కొన్ని ప్రాంతాల్లోని బిషప్లు సమర్ధిస్తున్నారని ఒప్పుకున్నారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. స్త్రీతో స్త్రీ, పురుషుడితో పురుషుడు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం చట్టరీత్యా నేరం కాదని, కానీ పాపం అని వ్యాఖ్యానించారు. వీటి మధ్య తేడాను తెలుసుకోవాలని హితవు పలికారు. దేవునికి ప్రతీ ఒక్కరిపైనా దయ, ప్రేమ, కరుణ, సున్నితత్వం ఉంటాయని, అందరినీ గౌరవించే విధంగా బిషప్లు మారాల్సిన అవసరం ఉందన్నారు.