డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి పోర్న్ క్లిప్ షేరింగ్.. అతనికేం తెలియదంట - MicTv.in - Telugu News
mictv telugu

డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి పోర్న్ క్లిప్ షేరింగ్.. అతనికేం తెలియదంట

October 20, 2020

Porn clip shared from Goa deputy chief minister’s phone, blames ‘miscreants’

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటూ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసి అడ్డంగా బుక్ అయిన ప్రజా ప్రతినిధుల గురించి తెలిసిందే. తాజాగా గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ బాబు కవెల్కర్ ఫోన్ నుంచి నుంచి ఒక వాట్సప్‌ గ్రూప్‌కు పోర్న్ క్లిప్‌ షేర్ అయింది. దీంతో సదరు వాట్సాప్ గ్రూపు సభ్యులు షాక్ అయ్యారు. ఓ ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ఫోన్ నుంచి పోర్న్ వీడియోలు రావడమేంటి అని వారంతా ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. ఈ మేరకు వారంతా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం కవెల్కర్‌ స్పందించారు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపారు. 

హ్యాకర్లను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సైబర్‌ సెల్‌ విభాగానికి ఫిర్యాదు చేశారు. ‘నేను చాలా వాట్సాప్ గ్రూపులలో మెంబర్‌గా ఉన్నాను. ఫోన్ హ్యాక్ చేసినవాళ్లు కావాలనే ‘విలేజెస్ ఆఫ్ గోవా’ గ్రూపులో ఆ క్లిప్‌ను పంపారు. మిగతా ఏ గ్రూప్‌కు ఈ క్లిప్ పంపలేదు. ఆదివారం రాత్రి 1:20 గంటలకు ఆ క్లిప్ ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను. ఇలా గతంలో కూడా నామీద కుట్ర చేశారు. నా పేరును, నా పరువును బజారుకీడ్చాలని చూస్తున్నారు. నా ఫోన్ హ్యాక్ చేసిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు’ అని కవెల్కర్‌ ఆరోపణలు చేశారు. కాగా, పోర్న్‌ క్లిప్‌ షేరింగ్‌పై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడి ప్రవర్తన అసభ్యకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేసింది. సామాజిక కార్యకర్తలను అవమానపర్చడానికి, వారిని కించపర్చడానికే చంద్రకాంత్ కవెల్కర్ ఉద్దేశపూర్వకంగా పోర్న్ వీడియోలను పంపించి ఉంటారని మండిపడుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.