ఆన్లైన్ బెట్టింగ్ ప్రచార ప్రకటనలపై కేంద్రం కొరడా ఝళిపించింది. వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు సూచించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో బెట్టింగ్, జూదం చట్ట విరుద్ధమని, వీటివల్ల వినియోగదారులకు గణనీయమైన నష్టాలు కలుగుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిపై ప్రకటనలు ముఖ్యంగా చిన్నారులు, యువతకు సామాజికార్ధిక ముప్పుగా పరిణమించాయని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
నిషేధిత కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ఉన్నాయని, అవి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని తెలిపింది. ఇది వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019కి విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978కి విరుద్ధంగా ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్‌ను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ప్రజా ప్రయోజానాలను కాపాడే క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్‌పై తాజా మార్గదర్శకాలను జారీ చేశామని తెలిపింది.