Posing as Patna HC chief justice, conman calls Bihar DGP for clean chit to Gaya SSP
mictv telugu

‘హైకోర్టు జడ్జీని మాట్లాడుతున్నా’ అంటూ డీజీపీకి కాల్.. అది నిజమనుకొని..

October 19, 2022

హైకోర్టు జడ్జీని మాట్లాడుతున్నానంటూ డీజీపీకి కాల్ చేసి, తన స్నేహితుడికి క్లీన్ చిట్ ఇవ్వాలని కోరాడు. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తే ఫోన్ చేసి చెప్పాడనుకొని.. ఆ మాటలు నమ్మి, నిజంగానే లిక్కర్ మాఫియా కేసులో నిందితుడైన వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చాడు. ఉన్నతాధికారుల పరిశీలనలో ఏదో తేడా జరిగినట్లు గుర్తించి ఆ నకిలీ న్యాయమూర్తిని కనిపెట్టారు. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. బీహార్ లోని పట్నా లో జరిగిందీ ఘటన. అసలు విషయానికొస్తే.. గతంలో ఓ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసులో గయా ప్రాంతానికి చెందిన 2011 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎస్పీ ఆదిత్య కుమార్ నిందితుడిగా ఉన్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆదిత్యకు క్లీన్ చిట్ ఇవ్వాలంటూ అభిషేక్ అనే వ్యక్తి.. బిహార్ డీజీపీ ఎస్కే సింఘాల్కు కాల్ చేశాడు. తాను పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినంటూ పలుమార్లు కాల్స్, వాట్సాప్‌లో అసలు న్యాయమూర్తి డీపీతో మెసేజ్‌లు కూడా చేశాడు. దీనిని నమ్మిన డీజీపీ.. ఆదిత్యకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ రిపోర్టును పరిశీలించిన సీఎంఓ ఆఫీస్.. ఈ కేసులో ఏదో అవకతవకలు జరిగినట్లు భావించి.. కేసును ఈఓయూకు(ఆర్థిక నేరాల విభాగం) అప్పగించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డీజీపీ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అభిషేక్ను పట్టుకున్నారు. అనంతరం ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేంద్ర సింగ్ గంగ్వార్ వెల్లడించారు. అభిషేక్ అగర్వాల్.. గతంలో చీటింగ్ సహా రెండు, మూడు కేసుల్లో నేరస్థుడిగా ఉన్నట్లు తెలిపారు. తీహార్ జైలులో శిక్షను కూడా అనుభవించినట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల నుంచి ఆదిత్యకుమార్.. అభిషేక్కు పరిచయమున్నట్లు వెల్లడించారు. “అభిషేక్ అగర్వాల్, ఆదిత్య కుమార్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. వారితో పాటు గౌరవ్ రాజ్, శుభం కుమార్, రాజుల్ రంజన్ అనే ముగ్గురిని కూడా ఈ కేసులో సహ నిందితులుగా చేర్చాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని డీజీపీ గంగ్వార్ తెలిపారు. తన ఐపీఎస్ ఫ్రెండ్ను లిక్కర్ కేసు నుంచి బయటకు తీసుకువచ్చేందుకే అభిషేక్ ఈ పని చేశాడని అధికారులు పేర్కొన్నారు.