Possibilities air purifiers in India compared with china xian pollution control
mictv telugu

మనదేశం ఇలాంటి ఎయిర్ ప్యూరిఫయర్లను ఎందుకు నిర్మించలేకపోతోంది?

November 7, 2022

Possibilities air purifiers in India compared with china xian pollution control

భారత దేశం కాలుష్యానికి అడ్డా అయిందని గగ్గోలు పెట్టడమే తప్ప నియంత్రణ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు మెట్రో నగరాల్లో, పెద్దపెద్ద సిటీల్లో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. వాహనాల సంఖ్య, పరిశ్రమలు పెరగడంతో గాలి కాలకూట విషమై ప్రజల ప్రాణాలను తీస్తోంది. శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీలో ఆడ్, ఈవెన్ నంబర్ల వాహనాల చిట్కా పనిచేయకపోగా విమర్శలపాలైంది. మరి కాలుష్య భూతానికి చెక్ పడేదెలా? ఈ విషయంలో మన పొరుగునే ఉన్న చైనాను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా?

ఊరంగా స్వచ్ఛంగా..

చైనాలోని జాంక్సీ నగరం దగ్గర్లో ఉన్న జియాన్ పట్టణం అది. చైనాలో మిగతా పారిశ్రామిక ప్రాంతాల్లో మాదిరే అక్కడా కాలుష్యం విపరీతంగా పెరిగింది. దీన్ని అరికట్టడానికి చైనా ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్టు చేపట్టింది. ఊరిలోని గాలిని శుభ్రం చేయడానికి భారీ ఎయిర్ ప్యూరిఫయర్ నిర్మించింది. 330 అడుగుల ఎత్తున్న ఈ నిర్మాణం ప్రపచంలోనే అత్యంత ఎయిర్ ప్యూరిఫయర్. ఇది కాలుష్య వాయువును పీల్చుకుని వేడెక్కించి, తర్వాత ఫిల్టర్ల ద్వారా స్వచ్ఛమైన గాలిని బయటికి వదులుతుంది. ఐదేళ్ల కిందట దీన్ని నిర్మించారు. ఆశించిన ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు జియాన్‌లో గాలి స్వచ్ఛంగా ఉందని అధికారులు చెబుతున్నారు. సౌరశక్తితో నడిచే ఈ ఎయిర్ ప్యూరిఫయర్ 10 కిలోమీటర్ల పరిధిలోగల గాలిని శుభ్రం చేయడమే కాక పొగను 20 శాతం తగ్గించింది. దీని సామర్థ్యాన్ని 30 కి.మీ. దూరం పెంచునున్నారు. దీని నిర్మాణానికి రూ. 16 కోట్లు ఖర్చు చేశారు.

Possibilities air purifiers in  India compared with china xian pollution control

మనదేశంలో..

ముందే చెప్పినట్లు మన దేశంలో వాయికాలుష్య నియంత్రణకు సరైన విధానాలే లేవు. ఆడ్, ఈవెన్ నంబర్ల, చిట్కా, నాటిన నాలుగు రోజులకే చచ్చిపోయే ‘పచ్చదనం’ మొక్కలు, కాలుష్య వాహనాలపై, ఫ్యాక్టరీలపై తూతూమంత్రం జరిమానాలు తప్ప శక్తిమంతమైన చర్యలు లేవు. ఎన్ని చట్టాలు, ఎన్ని నిఘా సంస్థలు ఉన్నా కాలుష్యం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. చైనా ఎయిర్ ఫ్యూరిఫయర్ లాంటివి చాలావరకు ఈ సమస్యను పరిష్కరిస్తాయన్నది నిపుణుల అంచనా. స్పష్టత, సమన్వయం లేని విధానాల్లో చేస్తున్న ఖర్చుకంటే ఇలాంటి ‘గాలి స్తంభాల’ వ్యయం, నిర్వహణ కూడా తక్కువే కాబట్టి ప్ర్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని సూచిస్తున్నారు. మేకిన్ ఇండియా వంటి ప్రణాళికలతో దేశాన్ని పారిశ్రామిక ప్రగతి బాటలో నడిప్తామంటున్న ప్రభుత్వాలు అందులో ఎంత విజయం సాధించాయో మనకు తెలిసిందే. కనీసం గాలి కాలుష్యాన్ని తగ్గించయినా ప్రాణాలు దక్కిస్తే అంతే చాలన్నది బాధితుల కోరిక.