పాక్‌లో పాడి తప్పు చేశా, క్షమించండి.. మికా సింగ్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికాసింగ్ విమర్శల ధాటికి దిగొచ్చాడు.. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మికా దాయాది దేశంలో ప్రదర్శన ఇచ్చాడు. దీంతో ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) అతనిపై నిషేధం విధించింది. దేశంలో పాటలు పాడడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సినిమాల్లో నటించడం పైనా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఎఫ్‌డబ్ల్యూఐసీ ఆదేశాలు కూడా జారీచేసింది.
కరాచీలో పాక్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కజిన్ కుమార్తెకు సంబంధించిన పెళ్లి వేడుకలో మికా సింగ్ ప్రదర్శన ఇవ్వడం తమను బాధించిందని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ పేర్కొంది. కాగా, తనపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆదివారం మికాసింగ్ ఓ వీడియోను ట్వీట్ చేశాడు. అందులో ఫెడరేషన్ అధ్యక్షుడు బీఎన్ తివారీ మాట్లాడుతూ.. ‘మికా నుంచి ఓ లేఖ అందింది. తనపై ఫెడరేషన్ తీసుకున్న చర్యలను అంగీకరిస్తున్నట్టు మికా పేర్కొన్నారు. నేను తప్పు చేశానని, అందుకు ఈ దేశానికి క్షమాపణలు చెబుతున్నానని మికా పేర్కొన్నారు. తన వాదన వినకుండా తనపై నిషేధం విధించొద్దని మికా ఆ లేఖలో పేర్కొన్నారు’ అని తివారీ తెలిపారు.