ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోస్టల్ సిబ్బంది అలసత్వం బహిరంగంగా బట్టబయలైంది. పట్టణ ప్రజలకు చేరాల్సిన ఒరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు లెటర్స్, వివిధ ప్రభుత్వ శాఖల చేరాల్సిన లేఖలు బట్వాడా చేయలేక తొర్రగుంట పాలెం ఆర్టీవో ఆఫీస్ వెనక ముళ్ళకంప లలో పడేశారు. వీటిలో లాయర్ నోటీసులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగులకు సంబంధించిన స్టడీ మెటీరియల్, సుమారు రెండు వందల ఒరిజినల్ ఆధార్ కార్డులు, ఇలా ఎన్నో రకాల రిజిస్టర్ పోస్టులు ఉన్నాయి. వీటిని గమ్యానికి చేర్చాల్సిన బాధ్యతను గాలికొదిలేసిన పోస్టల్ శాఖ చెత్త కుప్పలో వేసి చేతులు దులిపేసుకుంది. పోస్టల్ ఉద్యోగుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్టర్ పోస్ట్ లకు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసే పోస్టల్ శాఖ.. ప్రజలకు అందాల్సిన వస్తువులను ముళ్లకంపలో పడేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.