Posters Against Komatireddy Rajagopal Reddy In munugode Nalgonda District
mictv telugu

‘మునుగోడు నిన్ను క్షమించదు’.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు

August 13, 2022

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక పోరుపై రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా మునుగోడు నియోజ‌వ‌క‌ర్గంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు నిన్ను క్ష‌మించ‌దు.. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏండ్ల న‌మ్మ‌కాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ‌ను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేర‌మాడిన నీచుడివి’ అని పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట‌ర్లు న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా వెలిశాయి.

రాత్రికి రాత్రే వెలిసిన ఈ పోస్టర్ల గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. విపక్షనేతలే ఇలా పోస్టర్లు వేసి ఉంటారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈనెల 21న అమిత్ షా సమక్షంలో భారీ సభ ఏర్పాటు చేసి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి 3 గ్రామాలకు ఓ సీనియర్ నేతను ఇంఛార్జ్గా నియమించి ఉప ఎన్నిక సన్నాహాలు ప్రారంభించారు.

కాగా, రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఇక మిగిలింది ఉప ఎన్నికే. ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీలు మునుగోడుపై దృష్టి కేంద్రీక‌రించాయి. కోమ‌టిరెడ్డి త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో న‌ల్ల‌గొండ‌లో వెలిసిన పోస్ట‌ర్ల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుండా సొంత వ్యాపారాల కోస‌మే పాలిటిక్స్ చేస్తున్నార‌నే వాన‌ద‌లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున సొంత ల‌బ్ధి కోసం మునుగోడు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను బీజేపీ నేతల ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.