ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ ఫౌండర్ ములాయం సింగ్ యాదవ్‌కు ఆయన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇదంతా ప్రధాని మోదీ ‘పద్మ’వ్యూహమని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ అవార్డ్ ప్లాన్ చేశారని యూపీ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మూడు సార్లు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా, పది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్రమంత్రిగా.. సేవలందించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ములాయం కు యూపీలో భారీ పాపులారిటి ఉంది. యూపీ ‘నేతాజీ’గా పిలుచుకునే ఆయనకు చనిపోయాక పద్మవిభూషణ్ ప్రకటించడం వెనుక మోదీ పెద్ద ప్లానే ఉంది.
యాదవుల్లో ఉన్నతస్థాయి నేతగా గుర్తింపు చెందిన ములాయంకు మద్దతిచ్చిన అనేక మంది యాదవ వర్గాలు, బీసీలు ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు పూర్తిగా మద్దతివ్వడం లేదని, వారిని తమ వైపు తిప్పుకునేందుకే మోదీ ఈ వ్యూహం పన్నారని ఈ వర్గాలు భావిస్తున్నాయి. అఖిలేశ్‌ను ఏకాకి చేసేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని, దీని వల్ల సార్వత్రిక ఎన్నికల్లో ములాయం అభిమానుల్లో అనేకమంది మోదీవైపు మొగ్గు చూపుతారని ఈ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి యూపీ రాజకీయాల్లో ప్రధానిని బీసీ నేతగా బీజేపీ గత ఎనిమిదేళ్లుగా చిత్రీకరించడం మూలంగా పలు యాదవేతర బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపారని, ఇప్పుడు యాదవులు కూడా పునరాలోచన చేస్తారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే మోదీ నిర్ణయంలోని రాజకీయ వ్యూహం అర్థం చేసుకోలేని కొన్ని సంఘ్ పరివార్, బీజేపీ వర్గాలు మాత్రం ఇది తమ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ములాయంను కేంద్రం ఎగతాళి చేసిందని సమాజ్ వాదీ పార్టీ నేతలు అంటున్నారు. ఆ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య.. ములాయంకు పద్మవిభూషణ్‌తో సరిపెట్టిందని, ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ‘నేతాజీ ములాయం సింగ్ యాదవ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ ఇవ్వడం కేంద్రం ఆయన స్థాయిని ఎగతాళి చేసినట్లే.
ఆయన దేశానికి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుంటే ఆయన భారతరత్నకు అర్హుడు’ అని మౌర్య ట్వీట్ చేశారు. పార్టీ ప్రతినిధి ఐపీ సింగ్ కూడా ఇప్పటికైనా భూమి పుత్రుడు నేతాజీకి ఎలాంటి ఆలస్యం చేయకుండా భారతరత్న ఇవ్వాలని సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం బుధవారం ములాయం సింగ్ యాదవ్‌కు ప్రజా వ్యవహారాల విభాగంలో కేంద్రం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.