వండర్ పోస్ట్‌మేన్..30 ఏళ్లుగా రోజూ 15.కిమీ. నడుస్తూ  - MicTv.in - Telugu News
mictv telugu

వండర్ పోస్ట్‌మేన్..30 ఏళ్లుగా రోజూ 15.కిమీ. నడుస్తూ 

July 9, 2020

Postman Walked in Forests to Deliver Letters 

వృత్తినే జీవితంగా భావించి పని చేసే వారు ఈ సమాజంలో అరుదుగా కనిపిస్తారు. ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా సరే.. జీతం కోసం కాకుండా అంకిత భావంతో పని చేసుకుపోతుంటారు. అలాంటి  వారు ఎలాంటి గుర్తింపును కూడా కోరుకోరు. క్రమశిక్షణతోపాటు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ దశాబ్దాల పని చేసిన ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం. 

30 ఏళ్లుగా పోస్టు‌మెన్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఉత్తరాలు ఇచ్చేందుకు ప్రతి రోజూ 15 కిలోమీటర్లు నడిచేవాడు. దట్టమైన అడవిలో ఒంటరిగా నడిచి వెళ్లి వాటిని చేరవేసి ఆయనకు వృత్తిపై ఉన్న శ్రద్ధను చూపించాడు. మారుమూల పల్లెల్లో జరిగిన ఈ  విషయాన్ని ఓ ఐఏఎస్ అధికారి వెలుగులోకి తెచ్చారు.

తమిళనాడుకు చెందిన డీ శివన్.. కూనూర్‌లోని మారుమూల అటవీ ప్రాంతాలకు పోస్టు‌మెన్‌గా పని చేస్తున్నాడు. దాదాపు 30 ఏళ్లుగా అతడు విధులు నిర్వహిస్తున్నాడు. ఉత్తరాలను చేరవేసేందుకు ప్రతి రోజూ 15 కిలోమీటర్ల మేర నడిచి అందించేవాడు. ఒంటరిగా క్రూర మృగాల మధ్య నుంచి నడుచుకుంటూ సాహసోపేతమైన ప్రయాణం చేసేవాడు. ఇది ఆయనకు ప్రతి రోజు ఓ అగ్నిపరీక్ష లాంటిదే.. అయినా కూడా ఏనాడు వెనకడుగు వేయలేదు. ఉత్తరాలు ఇచ్చేందుకు వెళ్లే సమయంలో చాలా సార్లు ఏనుగులు, ఎలుగుబంట్లు అతన్ని తరిమేవి. అయినా కూడా వాటికి భయపడకుండా ఇంత కాలం తన సేవలను అందించాడు. 

ఇలా ఉత్తరాలు బట్వాడా చేస్తుండగానే అతనికి రిటైర్మెంట్ వయసు వచ్చింది. దీంతో ఇటీవల శివన్ పదవి విరమణ పొందాడు. ఈ సందర్భంగా పోస్టుమెన్ సేవల గురించి తెలుసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ట్విట్టర్ ద్వారా అతని గొప్పతనాన్ని పొగుడుతూ పోస్టు చేశారు. దీంతో అంతా ఆ వ్యక్తి చేసిన పనిని మెచ్చుకున్నారు. ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. ఇంత కాలం అంకితభావంతో నిర్విరామంగా పని చేసిన పోస్టుమెన్ ఇక ఆనందమైన జీవితం గడపాలని పలువురు ఆకాంక్షించారు. కాగా విధి నిర్వహణలో తనకు ఇవేవి పెద్దగా ఇబ్బంది అనిపించలేదని అతడు చెప్పడం విశేషం. మొత్తానికి ఈ వండర్ పోస్ట్‌మెన్ జీవితం ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలిచింది.