విజయవాడలో భారీ స్కాం.. కోటి నొక్కేసిన పోస్టుమాస్టర్
పేద ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును నిబంధనల ప్రకారం భద్రంగా దాచాల్సిన పోస్టుమాస్టర్ వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నిలువునా ముంచేశాడు. కనీసం ఖాతాదారులకు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వకుండా మోసం చేశాడు. పలు వ్యాపారాలు చేసి నష్టపోయి విచ్చలవిడిగా అప్పులు చేసి చివరికి పోస్టాఫీసుకే కన్నం వేసి అడ్డంగా దొరికిపోయాడు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ పరువు తీసిన ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. మనోజ్ అనే పోస్ట్ మాస్టర్ గతేడాది జూన్‌లో కృష్ణలంకలోని పోస్టాఫీసులో విధుల్లో చేరారు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు కూలీ పనులే జీవనాధారం కావడంతో పోస్టాఫీసులో ఎక్కువ సంఖ్యలో ఖాతాలు తెరిచారు. పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆర్డీ వంటివి మొత్తం కలిపి 7 వేల ఖాతాల వరకు ఉన్నాయి. అయితే వారి అమాయకత్వాన్ని అదునుగా భావించిన మనోజ్.. ఖాతాదారులు ఇచ్చిన సొమ్మును ఖాతాలో జమచేయకుండా నొక్కేశాడు. అంతేకాక, నకిలీ ఖాతాలు తెరచి వారి ద్వారా సొమ్ము డ్రా చేసుకున్నాడు. వీటితో అడ్డమైన వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోగా, వడ్డీలు చెల్లించడానికి ఇబ్బంది పడేవాడు. ఇదంతా కొంతకాలం సాఫీగా సాగినా, చివరకి డబ్బు సర్దుబాటు చేయలేక చేతులెత్తేయడంతో ఈ స్కాం బయటపడింది. దీంతో విచారణ జరిపిన అధికారులు సుమారు కోటి రూపాయల వరకు నిధులు లేనట్టు గుర్తించారు. ఇప్పటివరకు రూ. 10 లక్షలు రికవరీ చేయగా, ఖాతాదారులు తమ పాస్ పుస్తకాలు, స్టేట్ మెంట్ల వివరాలతో రావాలని కోరారు. అటు పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ స్కాంకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.