పూర్తైన విశాఖ గ్యాస్ లీక్ మృతుల పోస్ట్‌మార్టమ్
వైజాగ్ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. శుక్రవారం మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించగా..రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోయి, ఊపిరాడక చనిపోయారని విశాఖ కేజీహెచ్ ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. వీరంతా విషవాయువును పీల్చడంతో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని మరణించారని తెలిపారు. కేజీహెచ్‌లోనూ పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతులపై స్టైరీన్ గ్యాస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు వారి ఊపిరితితిత్తులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఈనెల 7వ తేదీన తెల్లవారుజామున ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కేంద్ర ప్రభుత్వం, ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డుకు (సీపీసీబీ) నోటీసులు జారీ చేసింది. అలాగే ఎల్జీ పాలిమర్స్ ఇండియాకు ఎన్జీటీ రూ. 50 కోట్ల మధ్యంతర జరిమానా విధించింది. ఈ గ్యాస్ లీక్ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం 5 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. నివేదికను రూపొందించేందుకు కమిటీకి అన్ని సహాయ సహకారాలను విశాఖపట్నం కలెక్టర్ అందించాలని ఎన్జీటీ ఆదేశించింది.