వరంగల్ బావి మృతుల పోస్ట్‌మార్టం.. మత్తులో ఉండగా ఈడ్చుకొచ్చి!
వరంగల్ శివారులోని ఓ బావిలో తొమ్మిది మంది చనిపోవడంపై పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టారు. పది బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు విస్తృతంగా గాలిస్తుండగా.. ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతోంది. ఈ మృతులకు సంబంధించి ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో మరిన్ని వివరాలు బయటపడుతున్నాయి. బావిలో నుంచి శుక్రవారం బయటకు తీసిన 9 మృతదేహాలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శనివారం శవపరీక్ష పూర్తయింది. వారిని బావిలోకి నెట్టి చంపారా? అనే అనుమానాలు ప్రాథమిక నివేదిక ఆధారంగా వ్యక్తం అవుతున్నాయి. నీటిలో మునగడం వల్లే వారు మృతిచెందారని ప్రాథమిన నివేదికలో వెల్లడైంది. అయితే రెండు మృతదేహాల్లో మాత్రం ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించలేదని నివేదికలో తేలింది.
మృతదేహాలను ఈడ్చుకొచ్చినట్లు వారి శరీరంపై ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. మత్తులో ఉన్నప్పుడు ఈడ్చుకొచ్చి బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు పోలీసులు స్వాధీనం చేసుకున్న 3 సెల్‌ఫోన్లలోని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.
10 బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరోసారి బావిలోకి దిగి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, అన్ని నివేదికలు క్రోడీకరించాకే ఏం జరిగిందో తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.