జగన్ హైదరాబాద్‌లో తిరగలేడు.. జేఏసీ హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ హైదరాబాద్‌లో తిరగలేడు.. జేఏసీ హెచ్చరిక

June 5, 2020

OU JAC.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఆపకపోతే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని ఓయూ జేఏసీ, దక్షిణ తెలంగాణ జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం జేఏసీ తరపున, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి వినతి పత్రం అందించారు. తెలంగాణ నీళ్లను జగన్ దోచుకుంటున్నారని జేఏసీ నేతలు కల్వకుర్తి ఆంజనేయులు, మాళిగ లింగుస్వామిలు మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోను రద్దు చేసుకోవాలని జగన్ ప్రభుత్వానికి చెప్పారు. జీవో 203 వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీటిని ఉత్తర తెలంగాణకు, కృష్ణా నీటిని రాయలసీమకు తరలించుకుపోతే మరి దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటని వారు  ప్రశ్నించారు. 

ఇప్పటికైనా కేసీఆర్ దక్షిణ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? లేదా ఉత్తర తెలంగాణకు ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ ప్రజా ప్రతినిధులు కేసీఆర్‌కు తొత్తులుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ ఎడారి అవుతోంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌లో కునుకు తీస్తున్నారని ఆరోపించారు. కుర్చీ వేసుకుని పాలమూరు ప్రాజెక్ట్ కట్టిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని.. టీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా పార్టీ అని జేఏసీ నేతలు విమర్శించారు. పోతిరెడ్డిపాడును దక్షిణ తెలంగాణ టీఆర్ఎస్ నేతలు అడ్డుకోకపోతే.. వారిని బయట తిరగకుండా అడ్డుకుంటామని వారు స్పష్టంచేశారు.