తెలంగాణ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ శనివారం అసెంబ్లీలో కంటోన్మెంట్ వారిపై మండిపడ్డారు. ఇప్పటివరకు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లు మూసేసే వారనీ, ఇప్పుడు నాలాల మీద చెక్‌డ్యాంలు నిర్మిస్తుండడం వల్ల సమీపంలోని కాలనీలు మునిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద్రాబాద్‌లో నాలాల మీద వచ్చిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ.. కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ఈ విషయంలో ఎన్ని సార్లు చెప్పినా వారి తీరు మారడం లేదనీ, చివరగా ఓ సారి చెప్పి చూస్తామన్నారు. అయినా వినకపోతే కంటోన్మెంట్‌కు కరెంటు, నీళ్లను బంద్ చేయాలని అసెంబ్లీలో ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. తర్వాత హైద్రాబాద్‌లో గతేడాది వచ్చిన వరదలను ప్రస్తావిస్తూ.. కేంద్రంపై విమర్శలు చేశారు కేటీఆర్. వరదలు వస్తే కేంద్ర మంత్రులు ఫోటో దిగి వెళ్లిపోయారు తప్ప ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. అదే గుజరాత్లో వరదలు వస్తే మోదీ స్వయంగా వెళ్లి రూ. వెయ్యి కోట్లను అందజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నిధులతోనే వరద కాల్వల నిర్మాణాన్ని చేపట్టినట్టు సభకు వెల్లడించారు.