మంచిర్యాల కలెక్టర్ ఇంటికి కరెంట్ కట్..  - MicTv.in - Telugu News
mictv telugu

మంచిర్యాల కలెక్టర్ ఇంటికి కరెంట్ కట్.. 

September 19, 2020

clatar

ఈమధ్య జనాలకు షాక్ ఇస్తున్న కరెంట్ బిల్లులు ఓ కలెక్టర్‌కు కూడా షాక్ ఇచ్చాయి. కరెంట్ బిల్లు కట్టలేదని ఏకంగా కలెక్టర్ ఇంటికి కనెక్షన్ కట్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఆ జిల్లా కలెక్టర్‌‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఇళ్లకు ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారుల నివాసాలకు భవనాలు లేవు. దీంతో జిల్లా కేంద్రంలోని ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అధికారుల కోసం నిర్మించిన ఇళ్ళలో కొన్ని ఖాళీ ఉండడంతో వాటిలో జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, అడిషనల్ కలెక్టర్ నివాసం, డీసీపీ నివాసాల కోసం కేటాయించారు. అప్పటినుంచి వారు అందులోనే కొనసాగుతున్నారు. 

అయితే ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత రెండు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన విద్యుత్ బకాయిలు చెల్లించడంలేదు. దీంతో రూ.11 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీకి వెళ్తున్న విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, సాయంత్రం వరకు ఉన్నతాధికారుల ఇళ్లకు వేరే లైన్ ద్వారా సరఫరాను పునరుద్ధరించారు.