ఈ వేసవి సెలవుల్లో ఏదైనా టూర్ కు ప్లాన్ చేసుకుంటున్నారా.. ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. దేశంలో మే నెలాఖరు వరకు 11 వందలకు పైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసినట్లు సమాచారం. కరెంట్ కోరత తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణం. దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, ఫలితంగా కరెంట్ వాడకం పెరగడంతో.. పలు రాష్ట్రాలు విద్యుదత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలించేందుకు వీలుగా.. ప్రయాణికుల రైళ్లను రద్దు చేశాయని తెలిసింది.
ఈనెల 24వ తేదీ వరకు దేశంలో వివిధన జోన్లకు సంబంధించి మొత్తం 11 వందల రైళ్లు నిలిచిపోనున్నాయి. రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్లలో 500 ఎక్స్ ప్రెస్ మెయిల్ రైళ్లు, 580 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 29న 240 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. ఆ స్థానంలో 400 బొగ్గు రైళ్లను రన్ చేసింది. దేశంలో మరో నెల రోజుల పాటు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడంతో బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఇప్పుడు 11 వందల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు అందుకు అనుగుణంగా ప్రయాణాలు పెట్టుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు రైల్వే అధికారులు.