రోడ్డుమీద 100 రూపాయల నోటు కనిపిస్తే చాలు, లక్కు భయ్యా అని గుట్టుచప్పుడు కాకుండా జేబులో వేసుకుంటారు చాలామంది. ఇంటికెళ్లి గొప్పలు చెప్పుకుంటారు. కొందరు నీతినిజాయతీగా వదిలేస్తారు, అది వేరే సంగతి. ఇక లాటరీలు, ప్రైజ్ మనీల సంగతి చెప్పక్కర్లేదు. పదివేలు తగిలితేనే పట్టపగ్గాలు ఉండవు. అలాంటిది ఏకంగా 16 వేల కోట్ల లాటరీ తగిలితే! తగలితే ఏమిటి ఆల్రెడీ తగిలింది. కానీ విజేత ఎవరన్నదానిపై రెండు నెలల సస్పెన్స్ నడిచింది. ఆ లక్ష్మీపుత్రుడు/పుత్రిక ఎవరబ్బా అని అమెరికన్లు జట్టు పీక్కుకున్నారు. ఆ దేశ చరిత్రలోనే అతి పెద్ద జాక్ పాట్ అయిన సదరు లాటరీ విజేత పేరును కాలిఫోర్నియా పవర్ బాల్ లాటరీ నిర్వాహకులు తాజాగా బహిర్గంతం చేశారు. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. లాటరీ విజేత వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది. లాటరీల్లో అక్రమాలను అరికట్టడానికి ఈ నిబంధన తెచ్చారు.
ఇదేం మెలిక?
గత నవంబర్ 2.04 బిలియన్లు(రూ. 16 వేల 590 కోట్ల) పవర్ బాల్ లాటరీ ఒకరికి తగిలింది. విజేత పేరు ఎడ్విన్ క్యాస్ట్రో అని లాటరీ నిర్వాహకులు తెలిపారు. అతని టికెట్ నంబర్, కొనుగోలు చేసిన ప్రాంతం వంటి వివరాలను వెల్లడించారు. ఇంటి అండ్రస్ వంటివి చెప్పలేదులెండి. అమెరికాలో 45 రాష్ట్రాల్లో పవర్ బాల్ జాక్‌పాట్ నిర్వహిస్తుంటారు. టిక్కెట్ వెల రెండు డాలర్లు. అయితే జాక్ పాట్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తారు. ఒకేసారి కావాలంటే మటుకు తక్కువ ముట్టజెబుతారు. ఎడ్విన్ అత్యాశకు పోకుండా ఒకేసారి ఇచ్చెయ్యండి మహాప్రభో అన్నాడు. దీంతో అతినికి 16 వేల కోట్ల కాకుండా అందులో ఇంచుమించు సగం.. రూ. 8,237 కోట్లు ఇవ్వనున్నారు.