Prabhas Fans Are Enthusiastic Fireworks In The Theater Caused A Fire
mictv telugu

‘బిల్లా’ స్పెషల్ షో.. థియేటర్‌ను తగులబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్!

October 23, 2022

అభిమానుల అత్యుత్సాహంతో థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రభాస్‌ జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. అభిమానుల సంఘం కోరిక మేరకు మూతపడ్డ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే అభిమానులు థియేటర్‌లో బాణసంచా కాల్చడంతో థియేటర్‌లోని సీట్లు దగ్ధమై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

తమ ఫేవరెట్ హీరోల పుట్టినరోజులకి, సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భాల్లో స్పెషల్ షోస్ వేయడం అనే నయా ట్రెండ్ ఈమధ్యే స్టార్ట్ అయ్యింది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేకి ‘పోకిరి’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ‘జల్సా’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రి రిలీజ్ చెయ్యడం.. ఈ సినిమాలన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం చూశాం.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంతు వచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు బిల్లా సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల ధియేటర్లలో స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. అయితే ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా పరిస్థితులు అదుపు తప్పాయి.

తాడేపల్లిగూడెంలోని వెంకటరమణ థియేటర్‌లో బిల్లా స్పెషల్ షో వేయించారు. సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చారు. సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ఇతర హీరోల అభిమానులు మాత్రమే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ సహ అభిమానుల ఈ వికృత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.