Practicals in Intermediate English Allotment of 20 marks in telangana
mictv telugu

ఇంటర్ ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్.. 20 మార్కుల కేటాయింపు

November 12, 2022

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సబ్జెక్టులో 20 మార్కులను ప్రాక్టికల్స్‌‌‌‌‌కి కేటాయించనున్నారు. రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేయాలని ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక, ఇంటర్ ఎంపీసీ రెండో ఏడాది గణితం సబ్జెక్టులో కొంత సిలబస్ తగ్గించాలని ఆదేశించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్ధులకు బయోమెట్రిక్ హజరు తప్పనిసరి చేశారు. సమావేశం అనంతరం మంత్రి సబిత మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతీఏటా మే నెలాఖరుకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ మూల్యాంకనాన్ని ప్రయోగాత్మకంగా ద్వితీయ భాషలైన తెలుగు, హిందీ, ఉర్ధూలకు అమలు చేస్తామని వెల్లడించారు. వాటిని ఆఫ్ లైన్‌‌లోనూ పరిశీలించి లోటుపాట్లను సరిచేసి వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని వివరించారు. అలాగే కామర్స్ పేరును కామర్స్ అండ్ అకౌంటెన్సీగా మార్పు, బోర్డులో 52 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ, అంధులు, మూగ, చెవిటి విద్యార్ధులకు పరీక్షల్లో ఇచ్చే సమయం 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు పెంపు వంటి నిర్ణయాలను మంత్రి మీడియాకు తెలిపారు.