వివాదాస్పద ఎంపీకి ‘రక్షణ’ కమిటీలో చోటు - MicTv.in - Telugu News
mictv telugu

వివాదాస్పద ఎంపీకి ‘రక్షణ’ కమిటీలో చోటు

November 21, 2019

Pragya .

బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ సంచలనాలు,వివాదాలకు మారుపేరుగా అందరికి సుపరిచితమే. ఆమె ఏది మాట్లాడినా సంచలనం కాకుండా పోదు. అలాంటి ఎంపీకి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్లమెంటరీ కన్సల్టేటివ్‌ కమిటీకి ఆమెను ఎంపిక చేశారు. 21 మంది సభ్యులు ఉండే ఈ కమిటీకి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీలోకి ఆమెను కూడా చేర్చుకున్నారు. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్ నుంచి ఆమె గెలుపొందారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌ను ఓడించి తొలిసారి ఆమె పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. విద్యార్థి దశలో ఏబీవీపీ విభాగంలో పనిచేశారు. 2008 మాలేగావ్‌‌‌లో జరిగిన బాంబు పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె మరో వివాదం సృష్టించారు. నాథురామ్‌ గాడ్సేను దేశభక్తుడుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ జోక్యంతో తరువాత ఆమె తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత కొంత కాలం పాటు ఎటువంటి వివాదాలకు పోలేదు. ఈ సమయంలోనే ఆమెకు ఈ అవకాశం దక్కడం విశేషం.