ప్రజ్ఞాసింగ్‌‌ను సజీవదహనం చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజ్ఞాసింగ్‌‌ను సజీవదహనం చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే

November 29, 2019

భోపాల్‌ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను సజీవ దహనం చేస్తానని మధ్యప్రదేశ్‌‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవర్థన్‌ డంగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞాసింగ్ బుధవారం పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేను అసలైన దేశభక్తుడని కీర్తించిన సంగతి తెలిసిందే. ప్రజ్ఞ వ్యాఖ్యలను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాలు ఖండించారు. దీని ఫలితంగా రక్షణ మంత్రిత్వ సలహా కమిటీ నుంచి ఆమెను తొలగించారు.

pragya singh.

ఈ నేపథ్యంలో ప్రజ్ఞ పార్లమెంట్‌లో క్షమాపణలు తెలిపారు. ఆమె ఈరోజు పార్లమెంట్‌లో మాట్లాడుతూ..’లోక్‌సభలో గాడ్సేపై నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. కోర్టు నేను నిర్దోషినని ప్రకటించినా.. సభలో ఓ సభ్యుడు నన్ను ‘ఉగ్రవాది’ అని ఆరోపించారు. నా పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకే కొందరు నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గాంధీపై నాకు గౌరవం ఉంది. ఒకవేళ నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నా’ అని తెలిపారు. 

ఆమె మాట్లాడుతుండగానే ప్రతిపక్ష నేతలు మహాత్మాగాంధీకి జై, డౌన్‌ డౌన్‌ గాడ్సే అంటూ నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రంగంలోకి దిగారు. స్పీకర్ మాట్లాడుతూ..గాంధీ సిద్ధాంతాలను ఒక్క భారత్‌ మాత్రమే కాదని, యావత్‌ ప్రపంచం అనుసరిస్తోందని అన్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చెయ్యొద్దని, అలా చేస్తే అది ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. అందుకే ఆమె వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్లు తెలిపారు.