ఏపీలోని గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై మీడియాతో మాట్లాడారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ ఆయనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు మాకు ఇదేమీ ఖర్మ..? అంటూ ప్రశ్నించారు. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చానని.. అయినా ఒక్క శాతం కూడా మారలేదు అని మండిపడ్డారు. అసలు డీజీపీకి బుద్ది ఉండొద్దా…? అనుమతులు ఎలా ఇస్తారు..? అని నిలదీశారు. పది వేల మందికి అనుమతి తీసుకుని నలభై, యాభై వేల మందిని తరలించారని ఆరోపించారు. అసలు, చట్ట విరుద్దమైన సభలకు ఎలా అనుమతి ఇస్తారు అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేదన్నారు. ప్రజలకు ఇప్పటికైనా బుద్ది రావాలన్నారు.
గుంటూరులో తొక్కిసలాట జరిగితే.. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నా స్పందించరా.. సినిమాలేవో చేసుకోవాలి.. పవన్‌కు రాజకీయాలు ఎందుకు అన్నారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తున్నారు.. మరి ఈ విషయం సీఎం జగన్ కూడా ఎందుకు భయపడుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకి కూడ అప్పులు ఇప్పించానన్నారు. ముసలోడివి(చంద్రబాబుని ఉద్దేశించి) నీకెందుకయ్యా రాజకీయాలు? అని ప్రశ్నించారు. జగన్‌కి చేతకాకపోతే రాజీనామా చేయాలని.. తాను పరిపాలిస్తాను అన్నారు.