Praja Shanti Party President KA Paul has alleged corruption in the Munugode by-election
mictv telugu

మునుగోడు ఎన్నికలపై కోర్టుకు వెళ్తా: కేఏ పాల్

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నికలో అవినీతి జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. తాను మొదటి నుంచి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదని, ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఈవీఎం ల ద్వారా ఎన్నికల జరిగినా ఓట్ల లెక్కింపు మూడు రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్, కౌంటింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితులైన అధికారులే జరపాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీ, ఆర్.వో. అందరూ కూడా కేసీఆర్ తొత్తులేనన్నారు. ఏ ఓటరు అయినా కేసీఆర్‌కు ఎందుకు ఓటెస్తాడని ప్రశ్నించారు.

మునుగోడు బై పోల్ అంతా ప్లాన్‌డ్ జరిగిందన్నారు కేఏ పాల్. 200 ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి ఎందుకు ఉంచారని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లలోని దాదాపు 200 ఈవీఎంలను లోపలికి తీసుకొచ్చి వాటిని మిగతావాటి స్థానంలో మార్చారని ఆరోపించారు. అధికారులకు కాస్తయినా బుర్ర, బుద్ది లేదా అని నిలదీశారు. ఎలక్షన్‌ అంతా అవినీతిమయంగా, కేసీఆర్ గుండాయిజంతో నడిచిందన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలు భారీగా అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. లక్షకుపైగా ఓట్లు తనకే వచ్చినట్లు చెప్పారు. బ్యాలెట్‌ పేపర్‌ పెడితే ఆ విషయం రుజువు చేసి చూపిస్తానన్నారు. అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు. ఈ ఎన్నికను రద్దు చేసి, మరల బ్యాలెట్ విధానంలో ఎన్నిక జరపాలని, పోటీలో ఉన్న 47 మందిలో 38 మంది ఇదే కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యం ఖూని అయిందన్నారు.