కేసీఆర్ బర్త్‌డే-సచివాలయంపై కోర్టుకెక్కిన కేఏ పాల్…
తెలంగాణ ప్రభుత్వం వందల కోట్లు ధారపోసి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయంపై వివాదాలున్న విషయం తెలిసిందే. పాత సచివాలయం ఇటీవల కట్టిందే అయినా కమీషన్ల కోసం కావాలనే కూల్చేసి కొత్తది కట్టారని విమర్శలు ఉన్నాయి. గవర్నర్ తమిళిసై కూడా మనకు కావాల్సింది ఇళ్లు అంటూ పరోక్షంగా విమర్శించారు. అయితే నగరం నడిబొడ్డున మరో అందమైన భవనం వస్తే మీ సొమ్మేం పోయిందని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినమైన ఏప్రిల్ 17న దీన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
దీనిపైనా విమర్శలు వచ్చాయి. సీఎం బర్త్ డేకి ఈ మూహూర్తానికి సంబంధమేంటని విపక్షాలు ప్రశ్నించారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ ఏకంగా హైకోర్టుకు వెళ్లాడు. సీఎం పుట్టినరోజున సచివాలయాన్ని ప్రారంభించడం సరికాదని అన్నారు. కొత్త సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్ అంబేద్కర్ పుట్టినరోజైన ఏప్రిల్ 14వ తేదీననే దాన్ని ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈకేసులో ప్రతివాదులుగా సీఎంఓను, చీఫ్ సెక్రటరీలను చేర్చారు. 2019లో మొదలైన కొత్త సచివాలయం పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ. 617 కోట్లు ఖర్చయినట్లు అంచనా. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ రానున్నారు.