థియేటర్లు తెరిచే అంశంపై జూన్ తర్వాతే ఆలోచిస్తాం.. కేంద్రమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

థియేటర్లు తెరిచే అంశంపై జూన్ తర్వాతే ఆలోచిస్తాం.. కేంద్రమంత్రి

June 3, 2020

 

After June.

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అనివార్యమైన నేపథ్యంలో ఎన్నో సంస్థలు, వ్యాపారాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. దాదాపు 70 రోజులుగా మూతబడిన విషయం తెలిసిందే. అయితే మూతపడ్డ సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామని, కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ నెలలో కరోనా కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించాకే.. థియేటర్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.

‌వీడియో కాన్ఫరెన్స్‌లో సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. ‘జూన్ తర్వాత ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాం. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ రోజుకు రూ.30 కోట్లకు పైగా నష్టపోతున్నప్పటికీ.. లాక్‌డౌన్‌పై సినీరంగం సంఘీభావంగా ఉంది. సినీ సంఘాల ప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’ అని మంత్రి వెల్లడించారు.