ప్రకాష్ రాజూ నువ్వు రాజువయ్యా ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రకాష్ రాజూ నువ్వు రాజువయ్యా !

June 29, 2017

‘ చెప్పేటోడు చెయ్యడు – చేసేటోడు చెప్పడు ’ అని పెద్ద మన్సులు అన్నట్టు అచ్చు గుద్దినట్టు మన ప్రకాష్ రాజ్ నిరూపించిండు. శెప్పకుంట మంచి పని జేశి సూపిచ్చిండు. ఉన్నోని దెగ్గర ఉచ్చీలుతనం ఎక్కుంటదని అంటరు గనీ దాన్ని రివర్స్ జేశి ప్రకాష్ రాజ్ కు రాజాగుణం ఉన్నదని సుపూత్ జేశిండు గదా. ప్రకాష్ రాజ్ రాజాతనం ఏందో తెల్సుకోవాలంటే మనం అర్జంటుగ రంగారెడ్డి జిల్లా కొండరెడ్డి పల్లెకు పోవాలె. అక్కడ ఛోటేమియా అనే పేద ముస్లిమాయిన గుడ్శెను, వాళ్ళ గరీబ్ తనంను సూశి కార్జం కదిలిచ్చుకున్నడేమో.. ఎంటనే ఆ కుటుంబంకు మాంచి ఇల్లు కట్టిచ్చి రంజాన్ పండుగు తోఫా ఇచ్చిండు. సూపర్ గదా.. శీన్మలల్ల ఎప్పుడు జూశినా విలన్ల క్యారెక్టర్లే ఎక్క జేశే గీన లోపట సమాజానికి పనికచ్చే హీరో వున్నడని నిరూపించిండు గదా.

కోట్లకు కోట్లు సంపాంచుకుంట స్టూడియోలు, ఛానళ్ళు, వందలు, వేల ఎక్రాలల్ల భూములు కొని పైశ కాయం జేస్కుంటున్న ఎందరో శీన్మలోల్లకు ప్రకాష్ రాజ్ శెంపపెట్టు అసుంటోడు. దిల్ దార్ మన్షికి నిలువుటద్దం ఆయిన అని ఛోటేమియా కుటుంబం మొత్తం మస్తు ఖుషీ మీదున్నరు. పేదోళ్ళకు సొంతింటి కల అన్నది అందనిది.. అసుంటోళ్ళ కలను నిజం జేశిన ప్రకాష్ రాజ్ అల్లా పంపిన ఫరిష్తా అంటున్నారు వాళ్ళు. మాకు గూడు కట్టిచ్చిన ఆ సారు సల్లగ బత్కాలని దువా జేస్తున్నరు రెండు శేతులు జోడిచ్చి.

ప్రకాష్ రాజ్ ను సూశి శీన్మలల్ల వున్న శాన మంది గీనతాన బుద్ది అచ్చే మస్తు సబకులు నేర్సుకునాల్నని అంటున్నరు నెటిజన్లు. ఈ తరీకల శీన్మలోల్లంత తలా ఒక్క శెయ్యి ఎయ్యాలె గనీ మన దేశంల శాన మంది దరిద్రం ఒదిలిపోయేదేమో !? ఒక్కపొద్దులు ఉన్నంత మాత్రాన పుణ్యం రాదు తోటి ముస్లిం తిన గతి లేక ఎన్ని తిప్పలు వడ్తున్నడో సూశి వాళ్ళ కడుపు నింపుర్రి.. అల్లా మస్తు పుణ్యం ఇస్తడు అని గూడ అంటున్నరు కొందరు.