ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన లక్ష్మీ మిట్టల్ తమ్ముడు ప్రమోద్ మిట్టల్ వ్యాపారంలో దివాళా తీశారు. ప్రస్తుతం ఆయనకు బ్రిటన్లో 2.5 బిలియన్ పౌండ్ల(మన కరెన్సీలో 24 వేల కోట్ల రూపాయల) అప్పు ఉంది. బ్రిటన్లో అత్యధిక అప్పులు ఉన్నవారిలో ప్రమోద్ ఒకరని తెలుస్తోంది. ప్రమోద్ తండ్రి పేరుతో 170 మిలియన్ పౌండ్ల అప్పు ఉండగా, ఆయన కుమారుడు దివేశ్ పేరుపై 2.4 మిలియన్ పౌండ్లు, ఆయన భార్య సంగీత పేరుపై 1.1 మిలియన్ పౌండ్లు, ఆయన బావ మరిది అమిత్ లోహియా పేరుపై 1.1 మిలియన్ పౌండ్ల అప్పు ఉన్నట్టు ఉందని సమాచారం.
2006లో ప్రమోద్ మిట్టల్ బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్ తరపున హామీ సంతకం పెట్టాడు. అయితే, జీఐకేఐఎల్ రుణాలను చెల్లించలేకపోయింది. రుణాలు ఇచ్చిన మార్గెట్ కంపెనీ 166 మిలియన్ డాలర్ల కోసం కోర్టుకు లాగింది. ఆ మొత్తాన్ని మిట్టల్ చెల్లించలేకపోవడంతో ఆయన దివాళా తీశాడు. ప్రమోద్ మిట్టల్ 2004లో తన పెద్ద కూతురు వనిశా పెళ్లి చేశారు. ఈ పెళ్ళికి అప్పుడు వందల కోట్లు ఖర్చుపెట్టాడు. తరువాత 2013లో ప్రమోద్ మిట్టల్ తన రెండవ కూతురు శ్రేష్టి వివాహం జరిపించాడు. ఆ వివాహానికి ఏకంగా రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. అప్పుడు బిడ్డల పెళ్లి ఘనంగా చేసి ఇప్పుడు దివాళా తీయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.